గులాబీని వీడను ఏ పార్టీలో చేరను
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కామెంట్
హైదరాబాద్ – తనకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని విడిచి వెళ్లే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాష్ గౌడ్. పార్టీ కష్ట కాలంలో ఉందని , ఈ సమయంలో పార్టీని విడిచి వెళ్లడం మంచి పద్దతి కాదన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డికి పార్టీ పరంగా ఎంతో విలువ దక్కిందని, కానీ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని మండిపడ్డారు.
పోయేటోళ్లు పోతారని కానీ తాను మాత్రం గులాబీ పార్టీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు వన్నాడ ప్రకాష్ గౌడ్. తనతో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, శ్రేయోభిలాషులు పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ జిలానీలుగా మారారు. తాజాగా మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కే. కేశవరావు కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది. దీపా దాస్ మున్షీ , వేం నరేందర్ రెడ్డి స్వయంగా కేకే ఇంటికి వెళ్లడం విస్తు పోయేలా చేసింది.