27 నుంచి బాబు ఎన్నికల ప్రచారం
ప్రకటించిన తెలుగుదేశం పార్టీ
అమరావతి – ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను దించేందుకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కంకణం కట్టుకున్నాయి. ఈ మేరకు ఈ మూడు కలిసి కూటమిగా ఏర్పాటు అయ్యాయి. ఇందులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు టికెట్లను కేటాయించే పనిలో పడ్డాయి.
తాజాగా తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈనెల 27 నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ప్రజాగళం పేరుతో టీడీపీ చీఫ్ సభలు, రోడ్ షోలు, సమావేశాలలో పాల్గొంటారని టీడీపీ వెల్లడించింది.
రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాలలో పర్యటించనున్నారు చంద్రబాబు నాయుడు. 27 నుంచి 31 దాకా కొనసాగుతుంది. 27న పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్ లలో ఎన్నికల ప్రచారం ఉండనుంది. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలలో, 29న శ్రీశైలం, నందికొట్కూర్ , కర్నూలులో , 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు , ఒంగోలులో సభలు, రోడ్ షోలు చేపట్టనున్నారు.