చర్యకు ప్రతిచర్య తప్పదు
జనసేన పార్టీ చీఫ్ వార్నింగ్
అమరావతి – జనసేన పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు సిద్దమై ఉన్నారని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని మోసం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం పథకాల పేరుతో లూటీ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో పాటు కొందరు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు.
తమ కూటమికి చెందిన నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేవలం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన నేతలు మాత్రమే దొరికారా అంటూ నిలదీశారు.
తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తాము కూడా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అప్పుడు చర్యకు ప్రతిచర్య తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.