మోదీపై కామెంట్స్ బీజేపీ సీరియస్
నిప్పులు చెరిగిన కె. అన్నామలై
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. కె. అన్నామలై మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులు ఓడి పోవడం ఖాయమని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ , సమర్థవంతమైన నాయకత్వంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన మోదీ గురించి కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కె. అన్నామలై.
డీఎంకే ఎంపీ కనిమొళి వేదికపై ఉండి కూడా ఇలాంటి చిల్లర కామెంట్స్ చేయడం దారుణమన్నారు. ఇదే పార్టీకి చెందిన మంత్రి తిరు అనితా రాధాకృష్ణన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు బీజేపీ చీఫ్.