DEVOTIONAL

అప్పన్న డోలోత్సవం అద్భుతం

Share it with your family & friends

భ‌క్త జ‌న సందోహం ప‌ర‌వ‌శం

సింహాచ‌లం – ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్త కోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నృసింహస్వామి డోలోత్స వము (పెళ్లి చూపులు ) అంగ రంగ వైభోగం గా నిర్వహించారు. ప్రతి ఏటా పూర్ణిమ రోజు సాంప్రదాయ బద్దంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు.

తెల్లవారుజామున సింహాద్రి నాదుడు ఉత్సవ మూర్తి ప్రతినిధి గోవిందరాజు స్వామిని సర్వ ఆభ‌ర‌ణాల‌తో అందంగా అలంకరించారు. అనంతరం మెట్లు మార్గం ద్వారా కొండ దిగువ కు తీసుకు వ‌చ్చారు. తొలి పావంచ వద్ద ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస్ మూర్తి, ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, గ్రామ పెద్దలు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి సాదరంగా గ్రామము లోకి స్వాగతం పలికారు.

అక్కడ నుంచి నేరుగా స్వామి తన సోదరి శ్రీ పైడితల్లి అమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం తన కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరగా అందుకు స్వామి ఆలోచించి తన నిర్ణయం చెబుతానని తిరిగి పుష్కరణి సత్రంకు చేరుకున్నారు.

అక్కడ విశ్వక్సేన, ఆరాధన, ఇతర పూజాది కార్యక్రమాలు పూర్తి చేశారు.. స్థానాచార్యులు టీపీ రాజగోపాలాచార్యులు ఉత్సవ సారాంశం వివరించారు. భక్తులకు వడ పప్పు, పానకం పంపిణీ చేశారు.

స్వామి వివాహం ఖరారు కావడం తో ఒకరి పై ఒకరు ఆనందం గా రంగులు చల్లుకున్నారు..బుగ్గన పెళ్లి బొట్టు తో స్వామి దర్శనం భక్తులు కు లభించగా భక్తులు పరవశించి పోయారు. అనంతరం గ్రామంలో స్వామి తిరువీధి, శోభా యాత్ర కార్యక్రమాలు వైభవంగా జరిపించారు.