DEVOTIONAL

17 నుండి ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాలు

Share it with your family & friends

వెల్ల‌డించిన జేఈవో వీర బ్ర‌హ్మం

క‌డ‌ప జిల్లా – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు వ‌చ్చే నెల ఏప్రిల్ 17 నుండి ప్రారంభం కానున్నాయ‌ని వెల్ల‌డించారు జేఈవో వీర బ్ర‌హ్మం. ఈ ఉత్స‌వాలు ఏప్రిల్ 25 వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

22న సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయ రామరాజు, జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశిల్ జిల్లా యంత్రాంగంతో ఒంటిమిట్టలో జేఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

   ఏప్రిల్ 16వ తేదీ అంకురార్ప‌ణ‌, ఏప్రిల్ 17న‌ శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 20వ తేదీన హనుమంత వాహనం, ఏప్రిల్ 21వ తేదీన‌ గరుడ వాహనం, ఏప్రిల్ 22న‌ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 23న రథోత్సవము, ఏప్రిల్ 25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగము జరుగుతాయని చెప్పారు.