గెలుస్తా ప్రజా సేవ చేస్తా
తమిళి సై సౌందర రాజన్
తమిళనాడు – తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ భారతీయ జనతా పార్టీ తరపున లోక్ సభ సభ్యురాలిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం తమిళి సై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో డీఎంకే పాలన పట్ల ప్రజలు విసిగి పోయారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా బీజేపీకి రోజు రోజుకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని చెప్పారు. 143 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో ప్రధాన మంత్రి తిరిగి మూడోసారి కావాలని కోరుకుంటున్నారని అన్నారు తమిళి సై సౌందర రాజన్.
యావత్ ప్రపంచం మోదీని చూసి విస్తు పోతున్నారని, ఆయన నాయకత్వ పటిమ స్పూర్తి దాయకంగా ఉందని తెలిపారు. తాను ఏ పదవిలో ఉన్నా ప్రజల మధ్యే ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఎన్నో సౌకర్యాలతో కూడిన గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ పదవులను త్యజించానని చెప్పారు తమిళి సై సౌందర రాజన్.
రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వ సాధారణమని, కేవలం ప్రజల మధ్య ఉండేందుకే తాను లోక్ సభ ఎన్నికల బరిలో ఉండాలని అనుకుంటున్నట్లు , అందుకే నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు.