ఫోన్ ట్యాపింగ్ పై ఎర్రబెల్లి కామెంట్స్
ప్రణీత్ రావు ది మా ఊరు ఒక్కటే
హైదరాబాద్ – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తన పేరు పదే పదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్కువగా వినిపిస్తుండడంతో గత్యంతరం లేక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనపై వస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. తనకు ట్యాపింగ్ కేసులో సస్పెండై ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
ప్రణీత్ రావు అమ్మమ్మ ఊరు తన ఊరు ఒక్కటే అని, అయినంత మాత్రాన ఇద్దరికీ లింకు కలిపితే ఎలా అని ప్రశ్నించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ అనేది లేకుండా గడిపానని చెప్పారు. విచిత్రం ఏమిటంటే కొత్త సర్కార్ తనను ఇరికించాలని, తనపై అక్రమంగా కేసులు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
తనపై శరణ్ చౌదరి చేసిన ఆరోపణలు శుద్ద అబద్దమన్నారు. ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టు తేలి పోయిందని స్పష్టం చేశారు. భూముల దందాలు, మోసాలు అతడి నైజం అని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి వీడియోను కూడా షేర్ చేశారు మాజీ మంత్రి.