తమిళ నాట బీజేపీ గెలుపు పక్కా
జోష్యం చెప్పిన కె. అన్నామలై
తమిళనాడు – రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ , అనుబంధ పార్టీల కూటమి తప్పక విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కె. అన్నామలై. 545 ఎంపీ స్థానాలలో తమకు కనీసం 400 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని అన్నారు. మంగళవారం తాను పోటీ చేయబోయే కోయంబత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కీలక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి కె. అన్నామలై ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మెకానికల్ ఇంజినీరింగ్, వ్యవసాయం, చేనేత వంటి పరిశ్రమలు కొలువు తీరి ఉన్నాయని వీటి గురించి పూర్తి సమాచారం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లోని 4.5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి ప్రయోజనం చేకూర్చే అనైమలై నల్లార్ ప్రాజెక్టు 60 ఏళ్లకు పైగా అమలు కాలేదని ఆరోపించారు కె. అన్నామలై. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించ లేదంటూ మండిపడ్డారు.
ఇది అమలు కావాలంటే కనీసం రూ. 10,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఇన్ని వేల కోట్లు మంజూరు ఇప్పట్లో సాధ్యం కాదు. కానీ తాను ఎంపీగా గెలిస్తే దీనిని తీసుకు వస్తానని, ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు కె. అన్నామలై.