తెలంగాణలోనూ జై భారత్ కు అదే గుర్తు
ప్రకటించిన పార్టీ చీఫ్ జేడీ లక్ష్మీ నారాయణ
విజయవాడ – సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ , జై భారత్ పార్టీ చీఫ్ వీవీ లక్ష్మీ నారాయణ కీలక ప్రకటన చేశారు. ఏపీలోనే కాదు తెలంగాణలో సైతం తమ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకే గుర్తు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో జేబీఎన్ పికి ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇపుడు తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇదే బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయిస్తూ, కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు లక్ష్మీనారాయణ.
అంతే కాకుండా, అటు మహారాష్ట్రలో కూడా ఎన్నికల్లో పోటీకి అనుమతిస్తూ, ఎన్నికల గుర్తు గ్యాస్ స్టవ్ ను కేటాయించిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో ఒకే బ్యాటరీ టార్చ్ కామన్ గుర్తుపై తాము పోటీ చేయడం, గర్వంగా భావిస్తున్నామని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు.