రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం
మాజీ మంత్రి కేటీఆర్ జోష్యం
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు అయ్యాక సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండడని , ఆయన మరో షిండే అవతారం ఎత్తడం ఖాయమని అన్నారు. బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంత్ రెడ్డి అవుతారని, రాసి పెట్టుకోమంటూ పేర్కొన్నారు.
ఓ వైపు రాహుల్ గాంధీ మోదీని టార్గెట్ చేస్తుంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి జపం చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. పార్టీలు మారడం రేవంత్ కు లెక్క కాదన్నారు. రోజుకో మాట మాట్లాడే ఆయనకు అంత సీన్ లేదన్నారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తి విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు కేటీఆర్.
నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ సీఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం తగదన్నారు. ఇప్పటికే వసూలు చేసిన డబ్బులను ఢిల్లికి పంపించాడని ఆరోపించారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటడం ఖాయమని అన్నారు కేటీఆర్.
కాబోయే లష్కర్ ఎంపీ పద్మారావు గౌడ్ అంటూ కితాబు ఇచ్చారు. ఆయనంటే ఇష్టపడని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. ఆయనను ఓడించడం ఎవరి తరం కాదన్నారు మాజీ మంత్రి.