సైకిల్ దిగను ఏ పార్టీలో చేరను
మాజీ ఎంపీ మాగంటి బాబు
అమరావతి – తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు, సైకిల్ కు గుడ్ బై చెబుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం తాను బిజీగా ఉన్నానని, అంతలోపే తాను పార్టీని వీడుతున్నట్లు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారంటూ మండిపడ్డారు. బుధవారం మాగంటి బాబు మీడియాతో మాట్లాడారు.
తాను పార్టీ మారడం లేదని కుండ బద్దలు కొట్టారు. తన జీవిత కాలమంతా సైకిల్ తోనే ఉంటానని, దానితోనే ప్రయాణం చేస్తానని స్పష్టం చేశారు మాగంటి బాబు. కొందరు లేనిపోని విమర్శలు చేయడం, దుష్ప్రచారానికి ఒడిగట్టడం మంచి పద్దతి కాదన్నారు.
ఏలూరులో పార్టీ బలోపేతం కోసం తాను కృషి చేస్తూనే ఉన్నానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొందడం పక్కా అని జోష్యం చెప్పారు మాగంటి బాబు. తన అనుచరులు, నేతలు, కార్యకర్తలు గాలి వార్తలు నమ్మవద్దని కోరారు . చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.