శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,097
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. ఇందులో భాగంగా గోవిందా గోవిందా , అనాధ రక్షక గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా , అదివో అల్లదివో శ్రీహరి వాసము, పది వేల శేషుల పడగల మయం అంటూ భక్తులు స్మరిస్తున్నారు. స్వామి వారిని కీర్తిస్తున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి తండోప తండాలుగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఆలయ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు సేవలలో నిమగ్నమై ఉన్నారు.
ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 64 వేల 97 మంది దర్శించుకున్నారని టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు. 24 వేల 453 మంది భక్తులు తల నీలాలు సమర్పించారని, ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని , శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎలాంటి టోకెన్లు లేని వారికి కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని స్పష్టం చేశారు ధర్మా రెడ్డి.