మోదీ మోసం నిరుద్యోగులకు శాపం
నీలకంఠాపురం రఘువీరా రెడ్డి
అనంతపురం జిల్లా – ఏపీ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఏడాదికి 2 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
మోదీ కొలువు తీరి 10 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు కనీసం 50 వేల పోస్టులు కూడా నింప లేక పోయారని, చివరకు చేతులెత్తేశారంటూ ఆరోపించారు ఎన్. రఘువీరా రెడ్డి. మోదీ చెప్పినట్లు అయితే తన పదవీ కాలం పూర్తయ్యే లోపు 20 కోట్ల జాబ్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) సంచలన ప్రకటన చేసిందని, ఇందులో 2012లో 42 శాతం నిరుద్యోగిత రేటు ఉంటే మోదీ వచ్చాక అది పూర్తిగా 37 శాతానికి తగ్గి పోయిందని వెల్లడించారు. ఇకనైనా మోదీ అబద్దాలు చెప్పడం మానుకోవాలని సూచించారు మాజీ మంత్రి.
ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని ధ్వజమెత్తారు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇకనైనా మోదీ మారాలని అన్నారు. ఇకనైనా నిరుద్యోగులు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు మాజీ మంత్రి.