బీఆర్ఎస్ ఖేల్ ఖతం
గంగాపురం కిషన్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనై పోయిందన్నారు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రజలు సుస్థిరమైన పాలనను, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, అవినీతి అన్నది పెచ్చరిల్లి పోయిందని, జవాబుదారీ తనం లేకుండా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మండిపడ్డారు. ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు పార్టీల మధ్య పోటీ ఉండ బోతోందని చెప్పారు గంగాపురం కిషన్ రెడ్డి.
ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కేవలం పేరుకు మాత్రమే ఉంటుందన్నారు. గతంలో ఎన్నో ప్రగల్భాలు పలికారని, దేశ వ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటూ చెప్పిన కేసీఆర్ ఇవాళ మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలన్నారు.
ప్రజలు ప్రస్తుతం బీజేపీ అయితేనే బాగుంటుందని విశ్వసిస్తున్నారని, ఆ దిశగా తాము కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి. తమకు 17 సీట్లు తప్పకుండా వస్తాయని పేర్కొన్నారు. తిరిగి కేంద్రంలో 400 సీట్లకు పైగా సాధించి మూడోసారి పవర్ లోకి వస్తామన్నారు.