వైసీపీ లక్ష్యం జన సంక్షేమం
స్పష్టం చేసిన వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి – తమ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే జన సంక్షేమం అని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర కొనసాగుతోంది. అడుగడుగునా జనం జగన్ కు నీరాజనం పలుకుతున్నారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
దేశంలో ఎక్కడా లేనీ విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందుతున్నాయని అన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు.
ఏపీని అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక కంట్రోల్ చేశామని తెలిపారు. నంద్యాల నుంచి ఏలేరు దాకా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , భువనేశ్వరి పార్టీలను సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు.
ప్రజల రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని, అవ్వా తాతల సంక్షేమ రాజ్యాన్ని కూల గొడదామని మూడు పార్టీలు కూటమిగా చూస్తున్నాయని ఆరోపించారు.
పేదోళ్ల భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తులమారి, జిత్తులమారి, ఎత్తులమారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తున్నాయి. కుతంత్రాలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా సిద్ధమేనా.. అని అడుగుతున్నానని అన్నారు.