రాజస్థాన్ దెబ్బ ఢిల్లీ అబ్బా
12 పరుగుల తేడాతో ఓటమి
జైపూర్ – ఐపీఎల్ 2024 టోర్నీలో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. తొలి మ్యాచ్ లో రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ ను 31 పరుగుల తేడాతో ఓడించింది రాజస్థాన్ రాయల్స్.
తాజాగా జైపూర్ వేదికగా జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఉత్కంఠ భరిత పోరులో 12 పరుగుల తేడాతో పరాజయం పాలు చేసింది. టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ కు దిగింది రాజస్థాన్ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 రన్స్ చేసింది. అంతకు ముందు కేవలం 36 పరుగులకే 3 కీలకమైన వికెట్లను కోల్పోయింది. జైశ్వాల్ , బట్లర్ , శాంసన్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగారు.
ఈ తరుణంలో ఊహించని రీతిలో మైదానంలోకి దిగిన యంగ్ అస్సామీ కుర్రాడు రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు , సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. చివరి దాకా ఉన్నాడు. ఏకంగా 84 రన్స్ చేశాడు. జట్టు స్కోర్ ను పరుగులు పెట్టించడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 175 రన్స్ కే పరిమితమైంది. ఆఖరు ఓవర్ లో ఆవేష్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ తో చుక్కలు చూపించాడు. మొత్తంగా పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 2వ స్థానంలో నిలిచింది.