మోదీ పంతం ఆప్ అంతం
అరవింద్ కేజ్రీవాల్ కామెంట్
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. మోదీ లక్ష్యం ఒక్కటేనని అది ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయడమేనని సంచలన ఆరోపణలు చేశారు. మోదీ కాదు కదా బీజేపీ, దాని శ్రేణులు ఆప్ ను అంతం చేయలేరంటూ హెచ్చరించారు.
తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మోపిన ఆరోపణలు, నివేదించిన ఛార్జ్ షీట్ పూర్తిగా తప్పుల తడకగా ఉందని మండిపడ్డారు. తాను జైలు నుంచి పాలన సాగిస్తానని స్పష్టం చేశారు. 30 వేల పేజీల నివేదికలో ఎక్కడా తాను డబ్బులు తీసుకున్నట్లు పేర్కొనలేదని ఇంతకంటే తాను ఇంకేం కావాలంటూ ప్రశ్నించారు.
దేశంలో విపక్షాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. తనకు రూ. 100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, దీనికి సంబంధించి మీ వద్ద ప్రూఫ్ ఉందా అని అడిగారు. ఒకవేళ తాను కూడా వంద కోట్లు మోదీకి ఇచ్చినట్లు విమర్శలు చేస్తే మీరు ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ సీఎం.