‘పట్నం’ మోసం ‘రంజిత్’ దారుణం
ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ సమావేశంలో ప్రసంగించారు. తాండూరుకు చెందిన పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఆ ఇద్దరు తమను దారుణంగా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లు ఇలా చేస్తారని తాము కలలో కూడా అనుకోలేదన్నారు.
ఇలాంటి వాళ్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటేనని అన్నారు కేటీఆర్. కేవలం పదవుల కోసం తమ పార్టీని వీడారని, తమ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్నంకు, రంజిత్ రెడ్డికి ఏం తక్కువ చేశారంటూ నిలదీశారు. ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చామని, ఇంకొకరికి ఎంపీ సీటు కట్టబెట్టామని చివరకు ఆదరించి, రాజకీయ గుర్తింపు ఇచ్చిన బీఆర్ఎస్ ను కాదని వెళ్లి పోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
పదవుల కోసం పార్టీలు మారే చరిత్ర కలిగిన వీరిని సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. రేపొద్దున ఇంతకంటే మంచి ఆఫర్ ఇస్తే వేరే పార్టీలోకి వెళ్లరని గ్యారెంటీ ఏమిటని నిలదీశారు కేటీఆర్.