నేతన్నలను ఆదుకోవాలి – బండి
సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సిరిసిల్లలో నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మేరకు శుక్రవారం బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నేత కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వారు తీవ్రమైన దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా వారిని ఆదుకోక పోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు బండి సంజయ్. సిరిసిల్ల నేత కార్మికులు అత్యంత నైపుణ్యం, నిబద్దత, ప్రతిభ కలిగిన కార్మికులని ప్రశంసించారు. అయితే వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు బీజేపీ మాజీ చీఫ్. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
వస్త్ర పరిశ్రమ కుదేలైందని, కార్మికులకు గత కొంత కాలంగా బకాయిలు చెల్లించక పోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని, మానవతా దృక్ఫథంతో ఆలోచించి సాయం చేయాలని సూచించారు సీఎంకు బండి సంజయ్ కుమార్ .