బాబు జీవితం కుట్రలమయం
నిప్పులు చెరిగిన విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షోకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు.
నెల్లూరులో టీడీపీకి అభ్యర్ధులు కూడా దొరకని స్థితిలో దిక్కు లేక వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన వారిని నిల బెట్టారంటూ బాబును ఉద్ధేశించి ఎద్దేవా చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కుట్రలమయమేనని సంచలన ఆరోపణలు చేశారు.
ఆ కుట్ర రాజకీయాలు ఇప్పుడు నెల్లూరుకు కూడా తీసుకు వచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలను వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి చూస్తూనే ఉందన్నారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పటికీ అధికారంలోకి వచ్చామని చెప్పారు విజయ సాయి రెడ్డి.
పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు ఇలాంటి కలుపు మొక్కల గురించి కార్యకర్తలు ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి బాధ్యత నాది అని ప్రకటించారు.