కాషాయం దేశానికి ప్రమాదం
ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
తమిళనాడు – ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్. శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆవడి ప్రాంతంలో ఇండియా కూటమి తరపున బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించారు. భారీ ఎత్తున జనం హాజరయ్యారు.
ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షోకు జనం నీరాజనం పలికారు. ఉదయనిధి స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఈ దేశంలో ఫాసిస్టుల రాజ్యం నడుస్తోందన్నారు. సెక్యూలరిజానికి తూట్లు పొడిచేలా హిందుత్వం ప్రభావం చూపిస్తోందంటూ మండిపడ్డారు ఉదయనిధి స్టాలిన్.
ఇండియా కూటమి గెలుపు సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. భారత దేశ కూటమికి వేసే ప్రతి ఓటు ఫాసిస్టులకు దెబ్బ పడుతుందన్నారు. ఓటు అత్యంత విలువైనదని, దానిని పని చేసే వారికి వేయాలని సూచించారు ఉదయనిధి స్టాలిన్. బీజేపీ చవకబారు రాజకీయాలను నమ్మవద్దని కోరారు.