కడియం ముందు రాజీనామా చేయ్
నిప్పులు చెరిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ డిప్యూటీ సీఎం , ప్రస్తుత స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి పై షాకింగ్ కామెంట్స్ చేశారు. సిగ్గు, శరం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పల్లా డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఏం తక్కువ చేశాడని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లావంటూ నిలదీశారు. ఆయన కూతురు కడియం కావ్యకు కూడా అందరినీ పక్కన పెట్టి వరంగల్ ఎంపీ సీటు కోసం అభ్యర్థిగా ప్రకటించారని అయినా పార్టీని విడిచి పెట్టడం దారుణమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కోవర్టు లాగా పని చేశాడని, ఒక్కరొక్కరినీ పార్టీ నుంచి బయటకు పంపించాడని ఆరోపించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. డబ్బులు, పదవుల ఆశకు లొంగి పోయారని, బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాడని మండిపడ్డారు. ఇక నుంచి స్టేషన్ ఘన్ పూర్ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ప్రకటించారు . ఏ మాత్రం గౌరవం ఉంటే కడియం వెంటనే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.