యూపీలో తుపాకీ పాలన – ఓవైసీ
ముక్తార్ అన్సారీ మృతిపై కామెంట్
హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని యూపీ సర్కార్ ప్రస్తుతం తుపాకీ నీడన నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
చట్ట బద్దమైన పాలన కొనసాగడం లేదని ఆవేదన చెందారు. గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ , 43కు పైగా కేసులు ఉన్న ముక్తార్ అన్సారీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారని అన్నారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, అన్సారీని జైలులోనే చంపేస్తారేమోనని సుప్రీంకోర్టులో కుటుంబీకులు పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు.
స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఓవైసీ. అన్సారీకి సరైన వైద్య సదుపాయం కల్పించ లేదని ఆరోపించారు. యూపీ సర్కార్ చట్ట బద్దమైన ప్రయోజనాల కోసం నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు ఎంపీ.