64 లక్షల 75 వేల మందికి రైతు బంధు
రూ. 5,575 కోట్లు జమ చేశామన్న భట్టి
హైదరాబాద్ – రాష్ట్రంలో రైతు బంధు కింద రైతులకు దశల వారీగా డబ్బులు జమ చేస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు 64 లక్షల 75 వేల మంది రైతులకు రైతు బంధు కింద డబ్బులను వారి వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
ప్రతిపక్షాలు పదే పదే రైతు బంధు ఏది అని ప్రశ్నిస్తున్నాయని , వారు చేసిన నిర్వాకం కారణంగా ఇవాళ ఖజానా ఖాళీ అయ్యిందన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు కింద రూ. 5,575 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.
ఇప్పటి వరకు ఇచ్చిన వారికి కాకుండా ఇంకా 5 లక్షల మంది రైతులకు రైతు బంధు వేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. దీనికి కారణం గత సర్కారేనని మండిపడ్డారు.
ఇవాళ ఆ భారాన్ని తాము మోస్తున్నామని, త్వరలోనే వాటిని కూడా వారి వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పలు చోట్ల తాగు నీటికి కటకటగా ఉందన్నారు. ఇందు కోసం బోర్లు వేయాలని తాము ఆదేశించడం జరిగందన్నారు .