జనంలోకి జనసేనాని
ఎన్నికల ప్రచారినికి శ్రీకారం
అమరావతి – ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన మార్చి 30న శనివారం నుంచి తన పర్యటనను ప్రారంభిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆయన మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తొలి విడతలో భాగంగా పవన్ కళ్యాణ్ 10 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల ఏప్రిల్ రెండో తేదీ వరకు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో ఉంటారని వెల్లడించారు.
బహిరంగ సభతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు చేపడతారని చెప్పారు. 3న తెనాలిలో , 4న నెలిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు నాదెండ్ల మనోహర్.
9వ తేదీన ఉగాది వేడుకలు పిఠాపురంలో జరుగుతాయని ఇందులో పవన్ పాల్గొంటారని తెలిపారు.. 10వ తేదీన రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిపారు.