తమిళుల సత్తా ఏమిటో చూపించాలి
పిలుపునిచ్చిన ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు – ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళుల సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు లోని తిరుప్పెరంబుదూర్ లోక్ సభ నియోజకవర్గంలో భారత కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. అశేష జన వాహనిని ఉద్దేశించి పార్టీ అభ్యర్థి డీఆర్ బాలుతో కలిసి ప్రసంగించారు ఉదయనిధి స్టాలిన్.
గత ఎన్నికల్లో డీఎంకే ఏం చెప్పిందో అదే చేసి చూపించిందన్నారు. అస్తవ్యస్తమైన పాలనకు చరమ గీతం పాడామని, అవినీతికి తావు లేకుండా చేశామని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు .
తమిళుల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా పదే పదే బీజేపీ ప్రయత్నం చేస్తోందని, మతం, కులం పేరుతో మనుషుల మధ్య విభేదాలను సృష్టించాలని చూస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఉదయనిధి స్టాలిన్. మనం ఎక్కడున్నా మన సత్తా ఏమిటో చూపించాలని అప్పుడే కేంద్రానికి కనువిప్పు కలుగుతుందన్నారు.