DEVOTIONAL

తిరుమ‌ల‌లో శ్రీ‌రామ ప‌ట్టాభిషేకం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమ‌ల – శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంగ‌రంగ వైభ‌వోపేతంగా ఆస్థాన మహోత్సవాన్ని నిర్వహిస్తోందని వెల్ల‌డించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ).

ఉత్సవాల్లో భాగంగా శ్రీరాముడు హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారని తెలిపింది. అదే విధంగా ఏప్రిల్ 18న ఆకట్టుకునే రీతిలో శ్రీరామ పట్టాభిషేకం ఉత్సవం నిర్వహించనున్న‌ట్లు వెల్ల‌డించింది.

రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంత ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం అందజేస్తారని పేర్కొంది. సాయంత్రం మాడ వీధుల్లో హనుమంత వాహన సేవ ఉంటుందని భ‌క్తులు పెద్ద ఎత్తున పాల్గొనాల‌ని కోరింది. అనంతరం రాత్రి శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో శ్రీరామ నవమి ఆస్థానం నిర్వహించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

రోజంతా జరిగే ఉత్సవాల దృష్ట్యా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను ర‌ద్దు చేసిన‌ట్టు టీటీడీ తెలిపింది. అదే విధంగా శ్రీవారి ఆలయ అర్చకులు బంగారు వాకిలిలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఏప్రిల్ 18వ తేదీ రాత్రి ఘనంగా నిర్వహించనున్న‌ట్లు పేర్కొంది టీటీడీ.