కానిస్టేబుళ్ల ఎంపికపై ఎందుకింత కక్ష
ఇకనైనా సీఎం స్పందించాలి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాల భర్తీ విషయంలో తాత్సారం చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తెలంగాణ పోలీస్ నియామక మండలి నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 1500 మంది ఎంపికయ్యారని , సర్కార్ అలసత్వం కారణంగా అన్యాయానికి గురయ్యారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
తమ స్వీయ ధృవీకరణ పత్రంలో తమపై రకరకాల కారణాలతో నమోదైన సివిల్, క్రిమినల్,బైండోవర్, కరోనా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు ఉన్నట్లు ధ్రువీకరించారు. వీరిపై నమోదైన కేసుల్లో వారు విద్యార్థి దశలో చేసిన విద్యార్థి ఉద్యమ కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కుటుంబ తగాదాలతో కక్షపూరితంగా,ఉద్దేశ పూర్వకంగా నమోదైన కేసులే అత్యధికంగా ఉన్నాయని తెలిపారు.
నమోదైన చాలా కేసుల్లో ఇప్పటికే కొందరు అభ్యర్థులు కోర్టుల్లో నిర్దోషిగా తేల్చబడ్డారని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ (SB) అధికారుల తుది పరిశీలనలో కూడా అభ్యర్థులు ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు,కేసుల్లో నిర్దోషిగా తేలిన కోర్టు జడ్జిమెంట్ కాపీలను అందజేసినా నేటి వరకు నియామక పత్రాలు ఇవ్వలేదని ఆరోపించారు.
వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, ఎంపికైన కానిస్టేబుళ్లకు న్యాయం చేయాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.