కేజ్రీవాల్ ను జైల్లో ఉంచలేరు
భార్య సునీతా కేజ్రీవాల్ కామెంట్స్
న్యూఢిల్లీ – ఇంకెంత కాలం తన భర్త, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టగలరని నిప్పులు చెరిగారు భార్య సునీతా కేజ్రీవాల్. ఆదివారం భరత కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కావాలని వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం తగదన్నారు.
ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నోసార్లు సోదాలు చేపట్టిందని, దాడులు చేసిందని, కనీసం వేయి రూపాయలు కూడా పట్టుకోలేక పోయాయని మండిపడ్డారు సునీతా కేజ్రీవాల్. ఆయన జైలు నుంచే పాలన సాగిస్తారని, కుట్ర పూరితంగా అరెస్ట్ అయిన ఆయన ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు.
ఈ దేశాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి, తమ వారికి అప్పనంగా కట్టబెడుతూ , వ్యాపార వేత్తలు, బడా బాబులకు , కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సునీతా కేజ్రీవాల్.
మోదీ తన భర్తను ఎదుర్కొనే దమ్ము లేక జైల్లో ఉంచారని, కేజ్రీవాల్ సామాన్యుడు కాదని సింహం లాంటోడని, ఆయనను ఎక్కువ కాలం బందీగా ఉంచ లేరని హెచ్చరించారు.