టీడీపీలో సామాజిక న్యాయమేది
నిప్పులు చెరిగిన మంత్రి బొత్స
విశాఖపట్టణం – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో లాబీయిస్టులకే టికెట్లు ఇచ్చారంటూ మండిపడ్డారు. సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఘనత ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డికే ఉందన్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తే అందులో 100కు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకే టికెట్లు కేటాయించామన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీలో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. ఇక 25 పార్లమెంట్ స్థానాలలో అత్యధిక సీట్లు బీసీలకే కేటాయించారని తెలిపారు. చంద్రబాబు ఏం చేశాడని ఓట్లు అడుగుతున్నాడంటూ ప్రశ్నించారు. పెన్షన్లను పంపిణీ చేయకుండా ఈసీకి ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. ఇకనైనా బాబు మారితే బెటర్ అని సూచించారు.
చివరకు డీఎస్సీని కూడా నిలుపుదల చేయించాడని , ఇక ఏం సుఖపడతాడని చంద్రబాబుపై మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. అయితే ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను తాము గౌరవిస్తామని చెప్పారు. విశాఖలో ఎంపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.