ఇండియా అంటే మోదీకి భయం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో తాను ఒక్కడినే ఉండాలని అనుకుంటున్నాడని, మిగతా ప్రతిపక్షాలు, నేతలను లేకుండా చేయాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీలోని రాం లీలా మైదానంలో సేవ్ డెమోక్రసీ పేరుతో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్బంగా జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ మోదీ పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను జైలులో పెట్టారని, అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు.
తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను కావాలని మూసి వేయించారని ఆరోపించారు రాహుల్ గాంధీ. అత్యున్నతమైన న్యాయ వ్యవస్థపై కూడా మోదీ ఒత్తిడి తీసుకు రావడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇకనైనా ప్రజలు మేల్కోవాలని , జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు.