పాలన అస్తవ్యస్తం కేసీఆర్ ఆగ్రహం
చేతకాని సీఎం అంటూ మండిపాటు
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ఉగ్ర రూపాన్ని చూపించారు. ఆయన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ను ఏకి పారేశారు. పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందారని, రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, తాగు, సాగు నీరుకు ఇబ్బంది ఏర్పడిందని, విద్యుత్ సరఫరా తీవ్ర ఆటంకం కలిగిస్తోందని ఆవేదన చెందారు. ఇదే సమయంలో రైతులు తాము పండించిన పంటలను అగ్నికి ఆహుతి చేసే పరిస్థితి నెలకొందన్నారు.
ప్రధానంగా నీరు, విద్యుత్ పై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. పంటలు ఎండి పోయేందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు కేసీఆర్. పాలన చేతకాక సీఎం చేతులెత్తేశారంటూ ఎద్దేవా చేశారు. జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎండి పోయిన పంటలను ఆయన పరిశీలించారు.
సాగర్ ప్రాజెక్టులో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకని నిల్వ ఉన్న నీటిని వాడుకోలేక పోతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. నీళ్లందని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాలు ఎండి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం పదే పదే ఢిల్లీకి వెళ్లడం రావడంతోనే సరి పోతోందని , ఇక పాలన ఎలా చేస్తాడని, ప్రజలను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు కేసీఆర్. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వంద రోజుల పాలనలో ఇప్పటి వరకు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు కేసీఆర్.