పాస్ వర్డ్ చెప్పని కేజ్రీవాల్ – ఈడీ
దర్యాప్తు సంస్థ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) .
విచారణలో భాగంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి సహకారం అందించడం లేదని ఆరోపించింది. ఇప్పటి వరకు ఆయన వాడుతున్న నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని పేర్కొంది. అయితే ఇంకో ఐ ఫోన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని ఫోన్లు ఓపెన్ అవుతున్నాయని కానీ ఒక్క యాపిల్ ఫోన్ మాత్రం తెరుచు కోవడం లేదని తెలిపింది. ఎన్నిసార్లు అడిగినా దాని పాస్ వర్డ్ చెప్పడం లేదని సంచలన ఆరోపణలు చేసింది ఈడీ.
కావాలని తమకు పాస్ వర్డ్ చెప్పడం లేదంటూ మండిపడింది. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన నివేదికలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించామని తెలిపింది ఈడీ. ఈ ఫోన్ కీలకమని, అది తెరుచుకుంటేనే కానీ తాము ఏమీ చెప్పలేమని స్పష్టం చేసింది. మొత్తంగా ఈడీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.