బీఆర్ఎస్..బీజేపీ మోసం దారుణం
మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి
హైదరాబాద్ – గల్ఫ్ కార్మికులను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్, బీజేపీకి దక్కుతుందని ఆరోపించారు మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్ , టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి. వీరు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గత పదేళ్లుగా కాలయాపన చేసి గల్ఫ్ కార్మికులను నట్టేట ముంచాయని ధ్వజమెత్తారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించిందని స్పష్టం చేశారు.
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్ ఏడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని ‘గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్’ లో గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.