గులాబీని వీడడం బాధాకరం
ఆవేదన వ్యక్తం చేసిన కడియం
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని విడిచి పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. ఒక రకంగా స్వంత ఇంటిని వదిలి పెట్టినంత బాధ కలుగుతోందన్నారు. కానీ గత్యంతరం లేక పార్టీని వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు కడియం శ్రీహరి.
అయితే తాను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ గురించి మాట్లాడ బోనంటూ పేర్కొన్నారు. ఎందుకంటే ఇద్దరం తెలుగుదేశం పార్టీ నుంచి కొనసాగుతున్నామని, మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్నారు. ఇదే సమయంలో తన పనితీరు, అనుభవం ఆధారంగా కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారని చెప్పారు.
కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఏ ఒక్కరు కొనసాగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. కేసీఆర్ పట్ల తనకు ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గదన్నారు. కానీ భావ సారూప్యత కలిగిన వ్యక్తులతో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు కడియం శ్రీహరి.