ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
టీడీపీ కూటమికి ఓటమి తప్పదు
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సిద్దం యాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. ఈ సందర్బంగా బుధవారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. నవ రత్నాలు అద్భుత ఫలితాలు ఇచ్చాయని, త్వరలో జరగబోయే ఎన్నికలలో ప్రజలు మరోసారి వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
అన్ని వర్గాల ప్రజలకు పాలనను చేరువ చేయడం జరిగిందన్నారు. దీని వల్ల కోట్లాది మందికి లబ్ది చేకూరిందన్నారు. కేంద్రీకృత వ్యవస్థ నుంచి వికేంద్రీకరణ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గడప గడపకు సంక్షేమ కార్యక్రమాలు చేరేలా కృషి చేశానని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.
మరోసారి తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. ఇక పవన్ కళ్యాణ్ పనై పోయిందని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రంలో బీజేపీ ఉందో లేదో ఎవరికీ తెలియదన్నారు. ఈ ముగ్గురితో కూడిన కూటమి అడ్రస్ లేకుండా పోతుందని హెచ్చరించారు.