DEVOTIONAL

కోదండ రాముడి గుడిలో తిరుమంజ‌నం

Share it with your family & friends

ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి – తిరుప‌తి లోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో బుధ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలీ గడ్డ , కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ఇదిలా ఉండ‌గా శ్రీ కోదండ రామాలయానికి హైదరాబాదుకు చెందిన ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు, తిరుప‌తికి చెందిన శ్రీ మ‌ణి అనే భ‌క్తుడు పరదాలు, కురాళాలు, కర్టన్లను విరాళంగా అందించారు

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, ఏఈవో పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ సోమ‌శేఖ‌ర్‌, ప్ర‌ధాన అర్చ‌కులు .ఆనంద‌కుమార్ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 7 నుండి 8.30 గంటల వ‌ర‌కు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.