మోదీపై యుద్దం తప్పదు
సంజయ్ సింగ్ వార్నింగ్
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపి బెయిల్ పై విడుదలయ్యారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. ఈ సందర్బంగా ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. అశేషమైన అభిమానులను ఉద్దేశించి ఎంపీ ప్రసంగించారు. ఆప్ కు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే మోదీ సర్కార్ తమపై కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
ఎలాంటి ఆధారాలు లభించక పోయినా కేవలం కక్ష సాధింపు ధోరణితోనే తమను అరెస్ట్ చేసిందని ఆరోపించారు సంజయ్ సింగ్. ఇక నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో అంతిమ విజయం ఆప్ దే అవుతుందని ప్రకటించారు.
మోదీ , బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు జరిపినా ఆప్ గెలుపును అడ్డుకోలేవన్నారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురే లేదని స్పష్టం చేశారు ఎంపీ సంజయ్ సింగ్. కేంద్ర దర్యాప్తు సంస్థలను చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్న మోదీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆప్ సైనికులు ధర్మ బద్దంగా పోరాటం చేస్తారని చెప్పారు . అనంతరం జైలు నుంచి నేరుగా అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆశీర్వాదం తీసుకున్నారు.