ప్రాణం ఉన్నంత దాకా జగన్ తోనే
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్
నెల్లూరు జిల్లా – వైసీపీ సిట్టింగ్ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం , వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డిపై తన అనురాగాన్ని వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీని విడిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంతే కాదు కొన ఊపిరి ఉన్నంత వరకు తాను జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని, ఆయన అడుగు జాడల్లో తాను నడుస్తానని ప్రకటించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను గెలిస్తే నెల్లూరు జిల్లాలో ఉండనంటూ అవాకులు చెవాకులు పేలుతున్నారని కానీ తాను పార్లమెంట్ సమయంలోనే హస్తినలో ఉంటాను తప్పా మిగతా రోజులన్నీ నెల్లూరులోనే గడుపుతానని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి.
వేమిరెడ్డి తన గురించి తీవ్ర విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. దమ్ముంటే తనతో ప్రత్యక్షంగా తేల్చుకోవాలని నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎవరు గెలుస్తారనేది త్వరలోనే తేలుతుందన్నారు. టీడీపీ కూటమి ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా పోతుందని జోష్యం చెప్పారు విజయ సాయిరెడ్డి. ఇకనైనా ముందు వెనుకా చూసుకుని మాట్లాడితే బావుంటుందని సూచించారు ఎంపీ.