NEWSTELANGANA

నేత‌న్న‌ల‌పై కాంగ్రెస్ స‌ర్కార్ వివ‌క్ష

Share it with your family & friends

ఎందుకింత క‌క్ష అని నిల‌దీసిన కేటీఆర్

సిరిసిల్ల – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఆయ‌న ఇవాళ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. నేత‌న్న‌ల‌ను ఆదుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారంటూ మండిప‌డ్డారు. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్న వారికి భ‌రోసా ఇవ్వాల్సిన ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఆరోపించారు కేటీఆర్.

ప్ర‌ధానంగా చేనేత కార్మికుల‌పై క‌క్ష క‌ట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కార్మికులు రోడ్డున ప‌డినా క‌నిక‌రించ‌క పోవడం దారుణ‌మ‌న్నారు. ప‌దేళ్ల త‌ర్వాత తిరిగి ఆనాటి ప‌రిస్థితులే పున‌రావృతం అవుతున్నాయ‌ని పేర్కొన్నారు. నేత‌న్న‌ల బ‌తుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం విధానాలు ఉన్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్.

చేనేత కార్మికుల‌కు అండ‌గా ఉండాల్సిన స‌ర్కార్ వారి పాలిట శాపంగా మారింద‌న్నారు. గ‌తంలో లాగే చేనేత‌న్న‌ల‌కు చేతి నిండా ఆర్డ‌ర్లు వెంట‌నే ఇవ్వాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. బ‌తుక‌మ్మ చీర‌లకు సంబంధించి ఆర్డ‌ర్లు ఇవ్వడంతో పాటు కోడ్ కార‌ణంగా నిలిపి వేసిన పెండింగ్ బిల్లులు వెంట‌నే చెల్లించాల‌ని కోరారు.

గ‌త బీఆర్ఎస్ స‌ర్కార్ పై ఉన్న కక్ష‌తో చేనేత‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు కేటీఆర్. వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోక పోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.