NEWSNATIONAL

మోదీ..షా దేశం కోసం ఏం చేశారు..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే

రాజ‌స్థాన్ – ఈ దేశానికి స్వాతంత్రం తీసుకు రావ‌డంలో కాంగ్రెస్ పార్టీ ఎన‌లేని కృషి చేసింద‌న్నారు ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే. ఆనాడు ఆంగ్లేయుల‌తో యుద్దం చేసింది త‌మ పార్టీనేన‌ని, వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసుకుంటే, బ‌లిదానాలు స‌మ‌ర్పిస్తే వ‌చ్చింద‌న్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌న్నారు. వందేళ్ల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన పార్టీ ప్ర‌పంచంలోనే చాలా అరుదు అని పేర్కొన్నారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాజ‌స్థాన్ లోని చిత్తోర్ గ‌ఢ్ లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ ర్యాలీలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. స్వాతంత్ర పోరాటంలో ఎంత మంది బీజేపీ నాయ‌కులు, ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లు చ‌ని పోయారో చెప్పాల‌ని నిల‌దీశారు.

పోనీ ఇవాళ ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కు ఉన్న ఘ‌న‌మైన చ‌రిత్ర ఏమిటో వివ‌రిస్తే ప్ర‌జ‌లు తెలుసుకుంటార‌ని ఎద్దేవా చేశారు. గోద్రా ఘోరం గురించి ఎవ‌రికి తెలియ‌ద‌ని మండిప‌డ్డారు.

కేవ‌లం కుల‌, మ‌తాల ఆధారంగా మ‌నుషుల మ‌ధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి త‌గిన రీతిలో బుద్ది చెప్పాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.