పురందేశ్వరి ఆరాటం బాబు కోసం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని
తాడేపల్లిగూడెం – మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. మరిది చంద్రబాబు నాయుడు కళ్లల్లో ఆనందం కోసం బీజేపీ చీఫ్ పురందేశ్వరి ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆమె బాబు జనతా పార్టీకి అధ్యక్షురాలు తప్పా బీజేపీకి కాదంటూ ఎద్దేవా చేశారు. బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు పేర్ని నాని.
ఆనాడు కన్నతండ్రి ఎన్టీఆర్ చావు లోనూ నేడు పేదల పక్షపాతి అయిన జగన్ మోహన్ రెడ్డిపై శిఖండి అవతారం ఎత్తిందంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ, టీడీపీ మధ్య ఆమెది రెండావుల దూడ పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు పేర్ని నాని.
బీజేపీలో తెలుగుదేశం దొంగలు పడ్డారనడానికి పోటీ అభ్యర్థులే సాక్ష్యం అన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి దిగజారుడు రాజకీయాల్ని సొంత పార్టీకి చెందిన నేతలే మండి పడుతున్నారని తెలిపారు. 22 మంది ఐపీఎస్ల బదిలీకి పురందేశ్వరి ఆదేశాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే ఆమె పని చేస్తున్నా రనేది నూటికి నూరు పాళ్లూ నిజం అన్నారు పేర్ని నాని. ఆయనకు అధికార లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పురందేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యనిర్వాహణ అధికారికి లేఖల మీద లేఖలు రాస్తోందన్నారు.