సప్తవర్ణ శోభితం పుష్ప యాగం
ఘనంగా మహోత్సవ కార్యక్రమం
తిరుపతి – తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం కన్నుల పండువగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామి వారికి పుష్పయాగాన్ని చేపట్టారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు.
పుష్పయాగానికి 3 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, ఏఈవో గోపినాథ్, తదితరులు పాల్గొన్నారు.