శ్రీవారి భక్తులకు శుభం కలగాలి
టీటీడీ ఈవో ధర్మారెడ్డి పిలుపు
తిరుమల – శ్రీవారి భక్తులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఏవీ ధర్మా రెడ్డి. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఏవీ ధర్మారెడ్డి భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్‌ను టీటీడీ ప్రచురించిందని, వచ్చే వారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయని ఈవో తెలిపారు.
9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా టిటిడి ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగ శ్రవణం ఉంటుందన్నారు.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉందని చెప్పారు టీటీడీ ఈవో. ఈనెల 21 నుండి 23వ తేది వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
ఇందులో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు ఏవీ ధర్మా రెడ్డి. 22వ తేదీ ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మ వార్లు స్వర్ణరథంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు.
టిటిడికి అనుబంధంగా ఉన్న పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈవో.
22వ తేదీన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు జరుగుతుందన్నారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ టీటీడీ చేస్తున్న కృషిని అభినందించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఎస్వీబిసి సిఈవో షణ్ముఖ కుమార్, సిఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.