DEVOTIONAL

బాబూజీ జీవితం స్పూర్తి దాయ‌కం

Share it with your family & friends

టీటీడీ జేఈవో వీర బ్ర‌హ్మం

తిరుమ‌ల – నిమ్న కులం పుట్టినా, ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగిన మ‌హోన్న‌త మాన‌వుడు బాబూ జ‌గ్జీవ‌న్ రాం అని కొనియాడారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం జేఈవో వీర బ్ర‌హ్మం. ఆయ‌న జయంతిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల‌లో 117వ జయంతి వేడుకలను తిరుప‌తి మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు వీర బ్ర‌హ్మం.

సమ సమాజ స్థాపన కోసం పాటు పడిన డాక్ట‌ర్ బాబు జగజ్జీవన్ రామ్‌ జీవితాన్ని ప్రతి ఒకరు ఆదర్శంగా తీసుకుని, వారి ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని జేఈవో కోరారు. నిమ్న కులంలో జన్మించిన బాబు జగజ్జీవన్ రామ్‌ డబ్బు లేక పోయినా, కుల వివక్ష ఎదురైనా వాటిని అధిగమించారని కొనియాడారు.

కష్టపడి చదువుకుని సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఎదిగి భారత ఉప ప్రధాని పదవిని అలంకరించారని అన్నారు జేఈవో. భారత రాజకీయాలలో క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీతో వివిధ మంత్రి పదవులకు వన్నెతెచ్చి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.

భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు, అటు తరువాత సమాజంలో సమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్రానంతరం మొదటి కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల అభ్యున్నతి కోసం పలు చట్టాలు తీసుకువచ్చారని చెప్పారు.