శ్రీవారి ఆదాయం రూ.118.49 కోట్లు
మార్చి నెలలో 21.10 లక్షల భక్తులు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. భారీ ఎత్తున తరలి వస్తుండడంతో టీటీడీ ఏర్పాట్లు చేయడంపై ఫోకస్ పెట్టింది. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు స్పష్టం చేశారు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
ఇదిలా ఉండగా తిరుపతి పరిపాలనా భవనంలో జరిగిన మీటింగ్ అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. గత మార్చి నెలకు సంబంధించిన విశేషాల గురించి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 21 లక్షల 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు ధర్మా రెడ్డి.
అంతే కాకుండా నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రూ. 118.49 కోట్లు వచ్చినట్లు స్పష్టం చేశారు ఈవో. 42.85 లక్షల మంది భక్తులు అన్నదానం స్వీకరించారని తెలిపారు. కళ్యాణ కట్టకు సంబంధించి 7.86 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.