బీజేపీకి జగన్ బానిస – షర్మిల
బానిస బతుకు ఎందుకు సీఎం
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం బస్సు యాత్రలో భాగంగా ఆమె పర్యటించి ప్రసంగించారు. కేంద్ర సర్కార్ కు, మోదీకి, బీజేపీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి బానిసగా మారి పోయాడని ఆరోపించారు. ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడతారంటూ ప్రశ్నించారు. ముస్లింలకు సీఎం సమాధానం చెప్పాలని అన్నారు.
గోద్రాలో దాడులు జరిగితే జగన్ ఎందుకు నోరు విప్ప లేదని ప్రశ్నించారు. బీజేపీకి వంత పాడుతున్న జగన్ రెడ్డి వైఎస్సార్ కు ఎలా వారసుడు అవుతాడంటూ నిలదీశారు. ఇమామ్ లకు రూ. 15 వేలు వేతనం ఇస్తానన్నాడు. చనిపోతే రూ. 5 లక్షల సాయం చేస్తానని ప్రకటించాడు. ముస్లింలకు ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. ఇవన్నీ ఎన్నికల వరకే ..ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డిలు ముస్లింల పక్షాన లేనే లేరన్నారు. వారికి ముస్లింలంటే గౌరవం లేదని అన్నారు. ముస్లింలకు రక్షణగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు.