రైతులపై కక్ష కాంగ్రెస్ వివక్ష
నిప్పులు చెరిగిన కేటీఆర్
సిరిసిల్ల – రైతులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం సిరిసిల్లలో రైతులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎండి పోయిన పంటలను చూసి తనకు బాధ కలుగుతోందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకున్నామని, వారికి అండగా నిలిచామని కానీ రేవంత్ సర్కార్ వచ్చాక చుక్కలు కనిపిస్తున్నాయని వాపోయారు.
ఎండి పోయిన పంట పొలాల రైతులకు ఎకరాకు రూ. 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని, ధాన్యానికి రూ. 500 బొనస్ ఇవ్వాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు.
ఇంత త్వరగా రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడు కోవాల్సి రావటం బాధాకరం అని అన్నారు. ఎర్రటి ఎండల్లోనూ కేసీఆర్ రైతుల కోసం బయటకు వచ్చి నేనున్నా అని వారికి భరోసా ఇస్తున్నారని కానీ సీఎం మాత్రం ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
రైతులను ఆదుకోవాలని లేక పోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.