అరెస్టులు..జైళ్లు..ఏమీ చేయలేవు
నిప్పులు చెరిగిన సంజయ్ ఆజాద్ సింగ్
న్యూఢిల్లీ – ఇలా ఎంత కాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిల్లర రాజకీయాలు చేస్తారో చూస్తూనే ఉంటామని అన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఆయన ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఆరు నెలల తర్వాత మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్బంగా ప్రముఖ జర్నలిస్ట్ రవీష్ కుమార్ తో ముచ్చటించారు సంజయ్ సింగ్. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వివరించారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా చేయాలని, రాజ్యాంగం పూర్తిగా తప్పించాలని ప్లాన్ జరుగుతోందని అన్నారు. ఈ దేశంలో 143 మంది ప్రజలకు వనరులు చెందకుండా, అవకాశాలు దక్కకుండా చేసేందుకు ప్రధానమంత్రి కావాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక్కడే ఉండాలని కోరుకుంటున్నాడని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఆప్ నేతలను జైల్లోకి నెట్టి వేశారని, అయినా తమకు జైళ్లు, కేసులు, అరెస్ట్ లు కొత్త కాదన్నారు సంజయ్ సింగ్. గాంధీ, భగత్ సింగ్, సుఖ్ దేవ్ లాంటి వాళ్లంతా జైల్లోనే ఉన్నారని, అక్కడి నుంచే పోరాటం చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
ప్రజలు ఇకనైనా మేల్కోక పోతే తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టబడతారని హెచ్చరించారు ఆప్ ఎంపీ.